నేను కంభంలో పాలిటెక్నిక్ చదివేటప్పుడు మా మిత్ర బృందానికి చిరునామా శ్రీ తిరుమల విలాస్. అందరం అక్కడే బోజనాలు చేసేవాళ్ళం. దానిని ఇద్దరు అన్నదమ్ములు కలిసి నడిపేవారు. వెంకటేశ్వర్లు అన్న మరియు పాండన్న. సాయంత్రమైతే మేమంతా అక్కడే వుండేవాళ్ళం. మాది చాలా పెద్ద గుంపు నేను, శ్రీకాంత్, రవీంద్ర, కిరణ్, శివ, సర్వేశ్వరరావు, అనంత్, సుబ్బుగాడు, నల్లకాలువ (శ్రీను), హెలికాప్టెర్ నారాయణ ఇలా చాలా మంది వుండేవాళ్ళం. అక్కడ ప్రతి మార్చి నెలలో వందలకొద్దీ బండ్లు, ట్రాక్టర్లు ఇంకా లారీలు బోలెడు జనాభాతో ప్రక్కన మనిషి కూడా కనిపించనంతగా దుమ్మురేపుకుంటూ పడమటి దిక్కుకి సాగిపోయేవి. మేమందరం పాండన్నకు సన్నిహితంగా వుండేవాళ్ళం. పాండన్నను అడిగితే అక్కడ శ్రీ కాటమ్మహారాజు తిరునాల జరుగుతుందని చాలా ఊర్లనించి జనాభా వస్తారని, చాలా బావుంటుందని చెప్పేసరికి అందరం వెళ్ళాలనుకున్నాం. మొత్తానికి మా చివరి సంవత్సరం అవకాశం వచ్చింది. పాండన్న వాళ్ళు అక్కడ టెంకాయల పాటపాడారంట. పాటంటే ఆ జాతరలో టెంకాయలు వాళ్ళు మాత్రమే అమ్మాలి. సహాయం కోసం పాండన్న మమ్మల్నందరిని పిలిచాడు దానికోసమే ఎదురుచూస్తున్న మేము అనందంగా బయలుదేరాము.
కోతిమూకలో, నేను, శ్రీకాంత్, సుబ్బుగాడు, నల్లకాలువ - వీడి అసలు పేరు వెంకటేశ్వర్లు కాని వాళ్ళ ఊరిపేరు నల్లకాలువ అందరం ఆపేరుతొనే పిలిచేవాళ్లం , అనంత్ ఇంకా పాండన్న బందువులు కొంతమంది కలిసి జీప్ లో బయలుదేరాం. అదంతా ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల సరిహద్దులో వున్న ప్రదేశం, అంతా ఎర్రని మట్టి, రాళ్ళు, కొండలు ఇంకా పలుచని అడవి - ఇది నల్లమల అడవికి ఆరంభం. అడుగుపెడితే సింగరేని బొగ్గుకాల్చినట్టు బోలెదు మట్టి పొగలా లేచేది. దారి సరిగా ఉండదు అంతా కొండ రాళ్ళతో నిండిపోయుంటుంది. మేమైతే డబ్బాలో వేసిన గులకరాళ్ళలాగా ఆ జీప్ లో అటుఇటూ ఎగిరిపడుతున్నాము. జీప్ మొత్తం ఏదో వస్తువుని జాగ్రత్తగా కట్టినట్టు చిన్న రంద్రం కూడా లెకుండా అన్నీ కప్పేసారు అలా ఎదుకు చేసారో తెలియలేదు మాకు. మొత్తానికి సాయంత్రానికి అక్కడకు చేరుకున్నాం. అప్పటికే అక్కడ ఇసుకవేస్తె రాలనంత జనం. చాలా సంబరంగా వుంది మాకు పల్లెటూరి అమ్మాయిలు, రకరకలా ఆటలు, పాటలు, అంగల్లు ఇంకా రంగులరాట్నాలు అసలు ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది.
పాండన్న అక్కడ కొబ్బరి కాయల అంగడి పెట్టాడు అదీ వేలాం పాటపాడి. మన నల్లకాలువ మైకులో గమ్మత్తుగా మాట్లాడుతూ కొబ్బరికాయలు అమ్ముతున్నాడు. నేను శ్రీకాంత్ గాడు నాటు సారా ఎక్కడ దొరుకుతుందా అని వెతికే పనిలో పడ్డాము. అప్పటివరకు ఎవరకీ మందు అలవాటు లేకపోయినా ఆరోజు ఎలా అయినా తాగాలని ముందే అనుకున్నాం. అలా వెతికి, వెతికి అలసి మళ్ళీ మా గుడారానికొచ్చాం. అప్పటి వరకు మేము ఒక విషయం గుర్తించలేదు. అక్కడ ప్రతీ ఒక్కరి చేతిలో కర్రలున్నాయి. వాళ్ళలో దాదాపు అందరూ బాగ తాగేసి వున్నారు.
No comments:
Post a Comment