మాకు చిన్నప్పుడు సంక్రాంతి కంటే పెద్ద పండుగ అంటేనే తెలుసు. సంక్రాంతి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళం. కొత్తబట్టలు కొనిస్త్రారని, బోలెడు పిండివంటలు చేస్తారని ఆశ. పిల్లలకి ఆ మూడు రోజుల్లో బాగా నచ్చేది భోగి పండుగ. భోగి కోసం నెల రోజుల ముందునించి (బలిజకంప) ముళ్ళకంప, తాటాకులు, పిచ్చిచెట్లు(అదో రకమైన చెట్లు) సేకరించేవాళ్ళం. అందరికంటే మా ఇంటి బోగే పెద్దగా ఉండాలని అందరి ఆశ. వీటి కోసం జట్లు, జట్లు గా పొలాలలోకి వెళ్ళేవాల్లం. ఒకరు కత్తితో కొడుతుంటె ఇంకొకకరు వాటిని తాళ్ళతో కట్టేవాళ్ళు. ఆశతో మేము మోయలేనత గ కట్టుకునేవాళ్ళం. ఇక వచ్చేటప్పుడు చూడాలి అవి మోయలేక కిందపడుతూ, మీదపడుతూ ఎలాగో ఇంటికి చేరుకునే వాళ్ళం.
మాకు ఇంకో ప్రధానాంశం అప్పచ్చులు(పిండివంటలు) సంక్రాంతికి ఓ వారం రోజులముందు నించే హడావుడి మొదలయ్యేది. ప్రతి ఇంట్లో రోకల్లమోత మొదలయ్యేది. మొదట బియ్యాన్ని రోజంతా నానబెట్టేవాళ్ళు తరువాత పెద్ద పెద్ద రోకల్లతో దంచేవాళ్ళు. ఇద్దరు దంచుతుంటే, ఒకరు జల్లెడ పడుతు, ఇంకొకకరు రాళ్ళతో పొయ్యిని చేసేవారు. పిండిమర ఉన్నా కాని అరిసెలు కోసం అందరూ దంచేవాళ్ళు. ఇల్లపక్కలవాళ్ళు ఒకరికి ఒకరు సాయంగా వుండేవాళ్ళు. అబ్బో ఎన్ని పిండివంటలో ఏ పండక్కి చేయనన్ని చేసేవాళ్ళు. అరిసెలు ( వీటినే కొన్ని ప్రాంతాల్లో నిప్పట్లు అని , అత్తరాసులు అని అంటారు ), మనుగుపూలు (వీటినే వీటినే కొన్ని ప్రాంతాల్లో చక్రాలు అని, కారాలు అని, మురుకులు అని అంటారు ), ఉప్పు చక్కలు, కజ్జికాయలు ఇలా ఎన్నో పిండివంటలు. అరిసెలు, మనుగుపూలు, చెక్కలు అందరి ఇల్లలో కచ్చితంగా చేస్తారు. మిగిలినవి ఎవరి ఇస్టాన్ని బట్టి, తాహతుని బట్టి చేసుకుంటారు. మేమయితే పిండిమరల చుట్టూ, దర్జీల చుట్టూ తిరిగేవాళ్ళం.
ఆరోజుల్లో పండుగ జనవరి 13,14,15 వచ్చేది ప్రతి సంవత్సరం. అసలు 12 రాత్రి నిద్రపట్టేది కాదు. ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు భోగి వేసి, భోగిస్నానం చేసి కొత్తబట్టలు వేసుకుంటామా అని ఆత్రుతగా ఎదురు చూసేవాళ్ళం. 13 వ తేది తెల్లవారు జామున 4 గంటలకే అందరు భోగి వేయటం మొదలుపెట్టేవాళ్ళు ఒక్కో ఇంటిముందు పెద్దమంటలు, ఇంట్లో వున్న పాత వస్తువులన్నీ వేసేవాళ్ళు. ఇక పోటీలు ప్రారంభం ఆ వీధిలో ఎవరికి వారే మా భోగి మంటే పద్దదిగ వుండాలని ఆకులు, కంప పెద్ద ఎత్తున వేసేవాళ్ళం. ఆ మంటలోనే ఓ కుండలో నీల్లు పెట్టేవాళ్ళు. మంట ఇక చివరకి వచ్చేసరికి తేగలు (మొలక ఎత్తిన తాటిపళ్ళు) వేసేవాళ్ళం మంటలో. ఇక వాటిని మాడిపోకుండా, ఒక్కటి కూడ వదిలేయకుండా బయటకి తీయడం పెద్ద కళ. ఆ తరువాత ఆ భోగి కుండలో నీళ్ళతో స్నానం చేసేవాళ్ళం. ఇక కాసేపు ఆగమన్నా ఆగకుండా కొత్తబట్టలు వేసుకొని దోస్తులని కలవడానికి వెళ్ళేవాళ్ళం. ఆ తరువాత ఒక్కో ఇంటిముందు రంగులతో దిద్దిన ముగ్గులు చూస్తు వాటిని ఆస్వాదిస్తూ అన్నీ వీధులు తిరిగేవాళ్ళం.
No comments:
Post a Comment